Monday, July 29, 2013

రుద్రాక్ష మహిమ


రుద్రాక్ష శక్తివంతమైన విత్తు. ఇది మానవుని యొక్క భౌతిక, దైవిక తాపాలను నశింపజేసి సిద్ధినీ, అభివృద్ధినీ కలుగజేస్తుంది. భక్తితో రుద్రాక్షను ధరించినా, పూజించినా శత్రుబాధలు ఉండవు. దుష్టశక్తులు దరిజేరవు. సూర్యగ్రహంవల్ల కలిగే దోషాలు కూడా నివారింపబడతాయి. శుచిగా, పవిత్రంగా ఉండే రుద్రాక్షధారుడికి కొత్త వస్త్రాలను సమర్పిస్తే చిరకాలంగా పీడిస్తున్న సమస్యలు సమసిపోతాయి. రుద్రాక్షధారణ వల్లనే శివుడు రుద్రుడయ్యాడు.
ఇంతటి మహిమ కలిగిన రుద్రాక్ష పుట్టుక గురించి పురాణాల్లో ఆసక్తికరమైన వృత్తాంతం ఉంది.. పూర్వం త్రిపురుడు అనే రాక్షసుడు వరగర్వంతో బ్రహ్మాది దేవతలపై దాడి చేసి, వారిని స్థానభ్రష్టుల్ని చేశాడు. ఆ రాక్షసుడ్ని ఎదుర్కొనే శక్తి లేక వారంతా శివుని వద్దకు వెళ్లి, త్రిపురుడి కారణంగా వచ్చి పడ్డ కష్టాలను చెప్పుకుని, ఆ రాక్షసుడ్ని సంహరించి తమను కాపాడమని కోరారు.
శివుడు వారికి అభయమిచ్చి, త్రిపురుడిని అంతం చేసే అఘోరాస్త్రం కోసం దేవమానం ప్రకారం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి కనులు తెరిచాడు. అలా తెరిచీ తెరవగానే- సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనబడే ఆయన త్రినేత్రాలనుండి బాష్పబిందువులు జలజల రాలి భూమి మీదపడ్డాయి. మరుక్షణమే అవి విత్తనాలై, స్వల్పకాలంలోనే మొలకలెత్తి పెద్ద పెద్ద చెట్లుగా పెరిగాయి. అవే రుద్రాక్ష వృక్షాలుగా పేరు పొందాయి.
రుద్రాక్షల్లో కపిల వర్ణంతో ఉండేవి శివుడి సూర్యనేత్రానివనీ, తెల్లగా ఉండేవి చంద్ర నేత్రానివనీ, నలుపుగా ఉండేవి అగ్ని నేత్రానివనీ మహర్షులు పేర్కొన్నారు. కపిల వర్ణం రాజసానికి, తెలుపు సాత్వికానికి, నలుపు తామసానికి చిహ్నాలు. వీటిలో ఏకముఖ రుద్రాక్షలు మొదలు- పధ్నాలుగు ముఖాలు ఉండే రుద్రాక్షలు ముఖ్యమైనవీ, ఎంతో మహిమ కలిగినవి. ఆయా రుద్రాక్షలవల్ల కలిగే ఫలితాలను కూడా రుషులు వివరించారు.
ఒకే ముఖం ఉన్న రుద్రాక్ష రుద్రస్వరూపం.. దీన్ని ధరిస్తే పరతత్వ జ్ఞానం కలుగుతుంది. రెండు ముఖాలున్నది అర్థనారీశ్వరం. పాపహరం. మూడు ముఖాలున్నది అగ్నిస్వరూపం.. స్ర్తి హత్యా పాపహారి. నాలుగు ముఖాలున్నది బ్రహ్మాత్మకం.. బ్రహ్మహత్యా పాతకాలను పోగొడుతుంది. అయిదు ముఖాలున్నది కాలాగ్ని రుద్రాత్మకం.. పొందకూడనివి పొందినందువల్ల కలిగే పాపాలు పోతాయి. ఆరు ముఖాలున్నది కుమారస్వామి స్వరూపం.. అగ్నిదోషాలను హరిస్తుంది. ఏడు ముఖాలున్నది అనంగాత్మకం.. బంగారం వంటివి దొంగిలించడంవల్ల వచ్చే పాపాలు నశిస్తాయి.
ఎనిమిది ముఖాలున్నది వినాయకాత్మకం.. సర్వవిఘ్నాలను తొలగిస్తుంది. తొమ్మిది ముఖాలున్నది భైరవాత్మకం... ఎడమ భుజాన ధరిస్తే భుక్తీ ముక్తీ కలుగుతాయి. పది ముఖాలున్నది జనార్థనాత్మకం.. భూత ప్రేతాలవల్ల వచ్చి పడే చికాకులను దూరం చేస్తుంది. పదకొండు ముఖాలున్నది ఏకాదశ రుద్రాత్మకం.. శిఖపై ధరిస్తే అశ్వమేథ ఫలం వస్తుంది. పనె్నండు ముఖాలున్నది ద్వాదశ సూర్యాత్మకం.. ద్వాదశాదిత్యుల అనుగ్రహం కలిగిస్తుంది. పదమూడు ముఖాలున్నది కార్తికేయాంశం.. సర్వార్థసిద్ధి ప్రదం.
ఇక పధ్నాలుగు ముఖాలున్నది లభించడం కష్టం... అదృష్టవశాత్తు ఇది లభించిన వాడు దీన్ని శిరస్సును ధరిస్తే అతడు పరమ శివుడే అవుతాడని శాస్త్ర వచనం. రుద్రాక్ష శివుని రూపంలో కూడా పూజింపబడుతోంది. శుచితో, పవిత్రతో శివప్రసాదమైన రుద్రాక్షను ధరించినవారు రోగ రహితులై నిత్యం ఉత్సాహంగా ఉంటారు. అనేక తీర్థయాత్రలు చేసి పొందే పుణ్యం రుద్రాక్షధారణవల్లనే పొందవచ్చుననీ, ప్రాణావసాన సమయంలో భక్తితో రుద్రాక్ష ధరించినవారికి దీని మహిమవల్ల కర్మఫలాలన్నీ నశించి పునర్జన్మ ఉండదని పురాణాలు పేర్కొన్నాయి.